గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు పార్టీ నేతలు యనమల, అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలతో ఉన్న పెన్‌డ్రైవ్‌ను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
సెలెక్ట్ కమిటీ అంటే భయమెందుకు: యనమల
శాసన మండలి రద్దుకు సుదీర్ఘమైన ప్రక్రియ ఉందని.. సభ రద్దయ్యే వరకు మండలి కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం యనమల మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీ అంటే వైకాపా ప్రభుత్వానికి భయమెందుకని యనమల ప్రశ్నించారు. ఆర్టికల్ 169 ప్రకారం తీర్మానం చేసే హక్కు మాత్రమే అసెంబ్లీకి ఉంటుందని చెప్పారు. కేవలం ప్రజాభిప్రాయం కోసమే బిల్లును సెలెక్ట్ కమిటీకి మండలి పంపించిందని.. ప్రజల అభిప్రాయాలను తీసుకునే విషయంలో వైకాపా నేతలు ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారని నిలదీశారు. ప్రజల అభిప్రాయం తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. ఎక్కణ్నుంచి అయినా పరిపాలన చేయవచ్చని సీఎం జగన్ చెబుతున్నారని.. అయితే ఇడుపులపాయ నుంచి పరిపాలన చేయండని యనమల ఎద్దేవా చేశారు.
గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు